No title

అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్యకు జోహార్లు 

అది 1968 డిశంబరు 9
తెలుగునాట ఉపాధ్యాయ ఉద్యమం ఒక ఆదర్శనేతను కోల్పోయిన రోజది!
వేలాది ఉపాధ్యాయులు తమ ప్రియతమ నాయుకుని స్మరిస్తూ
ఏటేటా శ్రద్ధాంజలి ఘటిస్తున్న రోజది.
ఎవరా ఆదర్శనేత?
ఎవరా ఆశాజ్యోతి?
అయనే కీ.శే. చెన్నుపాటి లక్ష్మయ్య !
'ఉపాధ్యాయ' లక్ష్మయ్య !
'ఉద్యమ పితామహ' లక్ష్మయ్య !

''ఇతరుల కొరకై త్యాగపూరిత జీవితం గడపటం ఎవరికైనా గర్వింపదగిన విషయం. అదికూడా పీడిత ప్రజల బాధా విముక్తి కోసమైతే అంతకంటే ధన్యమైన విషయం మరొకటి లేదు.'' 'ఎవరైనా మరణించబోయే మందు ఒక్క సారి గతజీవితాన్ని పర్యావలోకించుకొని' సమాజానికి తానేమైనా ఉపయోగపడ్డానా? అని ప్రశ్నించుకోవాలి. సంతృప్తి దొరికితేె అటువంటి వారి జీవితం ధన్యం! చెన్ను పాటిది అక్షరాలా ఆ ధన్యజీవుల కోవ.

త్యాగపూరిత జీవితం గడిపిన ఆదర్శపుత్రోవ.
ఆయన జీవితం అన్ని వర్గాల ఉపాధ్యాయులకు ఓ వెలుగుబాట.
భుజం ... భజం గలిపి, ధ్వజం ధ్వజం నిలపి హజాల నెదిరించిన ఉత్తేజపు పాట.
కష్టాలకు జంకక, నష్టాలకు హడలిపోక, నమ్మిన విశ్వాసాన్ని తుది శ్వాస దాకా ఆచరణలో పెట్టిన ధైర్య, స్థయిర్యాల చరిత్రే చెన్నుపాటి చరిత్ర. ఒకే మాటలో చెప్పాలంటే చెన్నుపాటి చరిత్ర ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర. పీడితోపాధ్యాయుల పెన్నిధి చరిత్ర.

తొలిరోజులు :
లక్ష్మయ్యది గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా, వేలూరు గ్రామం. చెన్నుపాటి వీరయ్య, మహా లక్ష్మమ్మలకు 1907(ఖచ్చితమైన పుట్టిన తేదీ లభ్యం కాలేదు)లో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టారు. స్వగ్రామంలోనే జిల్లాబోర్డు ప్రాధమికో పాధ్యాయుడుగా జీవితం ప్రారంభించాడాయన.

పరతంత్రపాలనలో అతి నికృష్టంగా ఉన్న బడి పంతుళ్ళ బాధామయగాధలు ఆయన్ని ఉద్యమంవైపు మరల్చినయ్‌ ఉపాధ్యాయ సంఘంతో దగ్గర సంబంధం పెట్టుకొనేట్టు చేసినయ్‌. అప్పుడు జిల్లా బోర్డు ఉపాధ్యాయ సంఘం నామమాత్రంగా ఉండేది. అధికారుల కనుసన్నల్లో మెలిగే జేబు సంస్థగా ఉండేది.

1942లో దానిలో బాధ్యతాయుత స్థానం స్వీకరించి, దాన్ని బలీయం చేయటానికి, నిజమైన ఉపాధ్యాయసంఘంగా రూపొందించ-టానికి ప్రబల ప్రయత్నం చేశాడాయన. క్రమక్రమంగా ఉపాధ్యాయులు తమకాళ్ళమీద తామునిలబడి, సంఘటిత శక్తి చూపుతూ, చైతన్యపూరితులు కాసాగేేరు. దానితో అధికారులకు గంగవెర్రులెత్తింది. తమ చేతుల్లోనుండి సంఘం దాటిపోతున్న కొద్దీ ఉగ్రావతారాలు ధరింపసాగేరు. అదిలింపులు, బెదిరింపులు, చేతనైన అంటంకాలన్నీ కల్పించారు. వాటికి లొంగలేదు. లక్ష్మయ్య, కృంగలేదు లక్ష్మయ్య ఇంకా దృఢదీక్షతో తన ప్రయత్నాన్ని ద్విగుణీకృతం చేశారు. కార్యకర్తల్ని సమకూర్చుకొని, సంఘాన్ని సమరశీల శక్తిగా తయారు చేసి, నాయకత్వం వహించి దారిచూప సాగేరు. సమస్యలపై పోరాటాలు ప్రారంభించారు.

అవి రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న రోజులు, దేశంలో జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినయ్‌. బియ్యం, చక్కెర, కిరోసిన్‌ మొదలైన వాటికి ప్రభుత్వం కంట్రోలు, రేషనింగ్‌ ప్రవేశ పెట్టింది. కాని అధికారులు, షాపు యజమానులు ఉపాధ్యాయులకు రేషన్‌ కార్డులు ఇవ్వటానికి నిరాకరించారు. అస్తు బిస్తు వేతనాలతో అలమటిస్తున్న టీచర్లు అధిక ధరలు భరించలేక, చీకటి బజారులో బియ్యం కొనలేక అలమటించ సాగేరు. అ విషమ పరిస్థితుల్లో, కార్యరంగానికురికి ఆందోళనకు నాయకత్వం వహించారు. దానిని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళి చివరికి విజయం సాధించారు. అధికారుల్ని లొంగదీసి ఉపాధ్యాయులకు కూడా రేషన్‌ కార్డులు లభించేట్టు చేశారు. దానితో ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం కుదిరింది. లక్ష్మయ్యగారిలో ఉద్యమదీక్ష పెంపొందింది.

ఉద్యమ విస్తరణ
ఆ రోజుల్లో ఒక్కొక్క మేనేజి మెంటుకు ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘం ఉండేది.ఒకే వృత్తి నవలంబించి, ఒకేకరమైన సమస్యలతో సతమత-మయ్యే ఉపాధ్యాయులు అలా వివిధ సంఘాలుగా చీలి ఉండటం ఉద్యమవ్యాప్తికి ప్రధానాటంకం అని ఆయన గ్రహించారు. వారి నందరిని ఒకే సంఘంలోకి తెచ్చి, ఒకే బాటలో నడిపించి ఐక్యోద్యమం నిర్మించాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. 1944లో నర్సరావుపేట తాలూకాబోర్డు ఉపాధ్యాయ సంఘాన్ని పునర్మించి దాని నాయకత్వాన్ని స్వీకరించారు. 1946లో రాష్ట్రస్థాయిలో వివిధ సంఘాల కార్యకర్తల సంయుక్త సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే వివిధ మేనేజిమెంట్ల క్రిందనున్న ప్రాధమికోపాధ్యాయు లందరినీ ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలనే చరిత్రాత్మక నిర్ణయం జరిగింది. దానిలో సమైక్యతకు దృడమైన ప్రాతిపదిక ఏర్పడింది.

1947లో రాష్ట్ర మహాసభ జరగటం, దానిలో ''ఆంధ్ర ప్రాధమికోపాధ్యాయ పెడరేషన్‌'' అవతరించటం, దీనకి లక్ష్మయ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలు. లక్ష్మయ్య అంతటితో ఆగలేదు. సంఘాన్ని ఇంకా విస్తృత పరచి పటిష్టత చేకూర్చటానికి శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా రాష్ట్రమంతటా విరామం లేకుండా పర్యటించారు. ఎందరో కార్యకర్తల్ని ప్రోత్సహించి రంగంలోకి తెచ్చారు. సమస్యలపై నిత్యం సంఘటిత పోరాటాలు నడిపి చైతన్య పూరితుల్ని చేశారు. ఆ సమైక్యఉద్యమాన్ని సమన్వయ పరచటానికి సంఘవాణిగా ''ఉపాధ్యాయ'' పత్రికను ప్రారంభించారు. 1948 నుండి 1955 దాకా దానికి ప్రధాన సంపాదకుడుగా ఉంటూ దానిని ఉపాధ్యాయవాణిగా, ఉద్మమ ప్రతిబింబంగా తీర్చిదిద్దారు.

బాలారిష్టాలు - ప్రతిఘటనలు
ప్రజలు చైతన్య పూరితులవుతుంటే దోపిడీ ప్రభుత్వం ఊరుకోదు. నిరంకుశాధికారులు సహించరు. అడుగడుగునా ఆంటంకాలు కల్పించి, ఉద్యమాన్ని నిర్వీర్యపరచటానికి భయభీతులు వ్యాపింపజేయటానికి ప్రత్నిస్తారు. ''ఉపాధ్యాయులకు సంఘ స్వాతంత్య్రంలేదని'' ఓ విపరీత ఉత్తర్వు జారీచేసింది ప్రభుత్వం. దాన్ని ప్రతిఘటించి. హైకోర్టుదాకా వెళ్ళి సంఘ స్వాతంత్య్ర నిషేధపుటుత్తర్వును రద్దు చేయించారు లక్ష్మయ్య.

శాసనసభా రంగం - సెకండరీ స్థాయి ఉద్యమవ్యాప్తి
విచిత్ర మేమిటంటేె పేరుకు ఉపాధ్యాయ నియోజక వర్గాలైనా వాటిలో వేలాది ప్రాదమికోపాధ్యాయులకు ఓటింగు హక్కులేదు. రాజ్యాంగంలో సెంకడరీ ఉపాధ్యాయులకు మాత్రమే ఆ హక్కు కల్పింపబడింది ప్రాథమికోపాధ్యాయులకు కూడా ఓటింగు హక్కు ఉండాలని తీవ్రాందోళన చేస్తూనే ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పాల్గొని ఫెడరేషన్‌ తమ అభ్యర్థిని గెల్పించటం జరిగింది. దానితో ఉద్యమం సెకండరీ రంగానికి క్రమక్రమంగా వ్యాపించింది. మరో మలుపు తిరిగి నూతన స్థాయినందుకున్నది.

1962లో లక్ష్మయ్య గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిల్చి సెకండరీటీచర్ల ఓట్లతో ఎన్నికయ్యారు. ఆ పరిచయాల్ని ఆధారంగా చేసుకొని ఎందరో సెకండరీ కార్యకర్తల్ని ఆయన తయారు చేశారు. ఆనాటి ఆయన అనుచరు లైన సెకండరీ కార్యకర్తల్లో గణనీయ భాగం ఆయన నెలకొల్పిన సాంప్రదాయాల్ని కాపాటడం కోసం నేడు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌లో ప్రధాన భాగస్వాములుగా వుండి కృషి సాగిస్తున్నారు. ప్రాంతీయ కేటగీరీ, మేనేజిమెంటు అవధుల్ని దాటి ఆయన లక్ష్యమైన విశాల సమైక్యతను ముందుకు తీసుకుపోతున్నారు.

1968లో గుంటూరు నియోజక వర్గంలో తిరిగి అయనే అబ్యర్థిగా నిల్చారు. కాని విచ్ఛిన్నకుల సైంధవ పాత్రతో ఆయన ఓడిపోయారు. అయినా ఆయన మరింత దృఢదీక్షతో ముందుకు సాగారు.

'పోరాటరంగంలో జయాపజయాలు సర్వసామాన్యాలు. జయం పొందినపుడు పొంగిపోవటం, అపజయం ఎదురైనపుడు కృంగిపోవటం కూడనిపని. గుణ పాఠాలు నేర్చుకొని ముందుకుసాగడమే మన కర్తవ్యం' అంటూ ఆయన కార్యకర్తల్ని ప్రోత్సహించి నైరాశ్యం తొలగించి ఉత్సాహపరిచారు.

పదవులూ - సేవా
ఉపాధ్యాయుల వేతనాల సవరణకై వివిధ సంఘాల ఐక్య కార్యాచరణ బాధ్యులుగా ఎలిమెంటరీ, సెకండరీ ఉపాధ్యాయుల వేతనాల పెంపుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య సభ్యుడుగావుంటూ ఆంధ్ర రాష్ట్ర ఆధ్యాపకుల సమస్యల్ని అఖిల భారత దృష్టికి తెచ్చేందుకు ఆయన పాటుబడ్డారు. ఉపాధ్యాయ ప్రతినిధిగా శాసన మండలిలో నిర్వరామ కృషి చేశారు. 1947 నుండి చనిపోయేవరకు దాదాపు 21 సంవత్సరాలు రాష్ట్ర సంఘానికి తిరుగులేని నాయకుడుగా వుండి. అధ్యక్షుడుగా ఎన్నికవుతూ అమోఘ సేవ చేశారు.

ఆదర్శ నాయకుడు
సంఘ నిర్మాణంలో, కార్యకర్తల్ని తయారు చేసుకోవటంలో, నాయకత్వం వహించటంలో ఆయన ఎన్నో సుసాంప్రదాయాల్ని నెలకొల్పారు. సమైక్య ప్రజాసంఘంగా వివిధాభిప్రాయాలు గల వారిని ఇముడ్చుకొని, వన్నెలూ, చిన్నెలూ దిద్దుకొని ఆయన ఆధ్వర్యాన మూడు పూలూ ఆరుకాయలుగా వర్థిల్లింది ఫెడరేషన్‌. పర్యటనకు వెళ్ళినా, ఆఫీసులోవున్నా వారికి విశ్రాంతి వుండేదికాదు. ఆఫీసుకు వచ్చిన టీచర్లతో వారి వారి సమస్యలు చర్చించటం, సలహాలివ్వటం, డ్రాప్టులు వ్రాసి యివ్వటం, కరస్పాండెన్స్‌ జరపటం నిర్విరామంగా కొనసాగించే వారు. ఇక పర్యటనకు బయలు దేరితే సభల్లో మాట్లడటం, ఉపాధ్యాయుల్ని సమైక్యపరచి చైతన్య పూరితుల్ని చేయటం, ఆర్థిక వనరుల్ని సమకూర్చటం, పత్రికా వ్యాప్తికి పాటుబడటం, కార్యకర్తల మంచి చెడులు తెలుసుకొని సాయపడటం ఇలా ఊపిరి సలపని కార్యక్రమాల్లో మునిగితేలేవారు.

నిస్వార్థ త్యాగజీవితం
ఆయన ఉపాధ్యాయ ఉద్యమంలో చేరిన తర్వాత ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా ముందుకు వచ్చారు. పిత్రార్జితంగా ఉన్న కొద్ది ఆస్తి కూడా ఉద్యమంలో హారతికర్పూరమయినా ఆయన దీక్ష విడువలేదు. కష్టాలను నష్టాలను మేరువులా ఎదుర్కొని సేవాధర్మమే సర్వంగా రాటుదేలారాయన. బిడ్డలు కల్పన, సీతారామయ్యలు కూడా కష్టాలపాలయ్యారు. చివరికి తన జీవిత భాగస్వామి హనుమాయమ్మ జబ్బుపడితే ఆమెకు మందులిప్పించే తాహతులేక ఆమెను కూడా కోల్పోయారు. ఆమె మరణించిన రోజే జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌లో ఏమాత్రం చలించకుండా యధాప్రకారం పాల్గొన్నారంటే, ఆయన మనస్థైర్యం ఎటువంటిదో మనకర్థం అవుతుంది. అలా ఆయన జీవితం ఉద్యమంతో పెనువేసుకొని అదే సర్వం అయింది.

సమైక్య ఉద్యమాన్ని కాపాడటానికి ఆయన అన్ని విధాలా ప్రయత్నం చేశారు. సంఘ సమావేశాల్లో ఉత్పన్నమైన ఎంతటి జటిలసమస్యనైనా పరిష్కరించటానికి ఆయన సూచించే సూచనలు అందరి అమోదాన్ని పొందుతూ వుండేవి. ఉద్యమం స్తబ్దతలో ఉన్పప్పుడు కార్యకర్తల్ని ఉత్సాహపరస్తూ, స్వయంగా వారిని కలుసుకొంటూ, ఆర్థిక పరిస్థితుల్ని పరామర్శిస్తూ, వారి కుటుంబాల్లో కలిసిపోయి వారిని ప్రాణాధికంగా కాపాడుకొనేవారు. ఉద్యమం సజీవశక్తిగా పనిచేయటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకొనేవారు. శాసన మండలి సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్నీ, అలవెన్సులనూ సంఘ నిధికే జమ కట్టేవారు. అత్యవసరమైన ఖర్చులకు సంఘం నుండి వాడుకొనేవారు. ఎప్పటికప్పుడు జమాఖర్చులు చెప్తూ, ఆడిట్‌ చేయిస్తూ ఆర్థిక విషయాలలో నిక్కచ్చిగా ఉండేవారు.

అంతిమ దినాలు
ఎన్నికల అనంతరం జలోదర వ్యాధి కారణంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. విజయవాడ ప్రజావైద్యశాలలో దాదాపు రెండు మాసాలు ఆయన మృత్యువుతో పోరాడారు. మృత్యు వాసన్నమయిందని తెలియగానే తాను పెంచి పెద్ద జేసిన సంఘ కార్యాలయంలోనే ప్రాణాలను విడవటానికి ఆయన నిశ్చయించుకొన్నారు.

చివరికి 1968 డిసెంబరు 9న సంఘ ప్రధాన కార్యాలయంలో సహచరుల అశృతర్పణాల మధ్య ఆయన కన్ను మూశారు. ఆయన భౌతికకాయాన్ని విచార నిమగ్నులైన వందలాది ఉపాధ్యాయులు శ్మశానానికి ఊరేగింపుగా పూలమాలల్లోముంచి తీసుకువెళ్ళారు. చిరస్మరణీయమైన ఆయన గంభీర భౌతిక విగ్రహం చితిలోకాలి భస్మమైనా వేలాది ఉపాధ్యాయుల హృదయాల్లో నిల్చి శాశ్వతత్వాన్ని కల్పించింది.

చెన్నుపాటి యే సమైక్యతకై తన జీవితాన్ని అర్పించాడో ఆ సమైక్యతను కాపాడి, ప్రాంతీయ భేదాలను అధిగమించి అన్ని కేటగిరీల, మేనేజిమెంట్ల ఉపాధ్యాయుల్ని ఒకే వేదికమీదికి తేవటానికి ఆంధ్రప్రదేశ్‌ అంతటికీ చెందిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ స్థాపింపబడింది. కొద్ది నెలల్లోనే తెలంగాణా జిల్లాలకు కూడా విస్తరించింది. ఉపాధ్యాయుల హక్కులకు, సంక్షేమానికి, వృత్తి భద్రతకు, విద్యారంగాభివృద్ధికి నిత్యపోరాటాలు జరుపుతూ సమరశీల పోరాట సంస్థగా, చెన్నుపాటి ఆశయాన్ని వుణికి పుచ్చుకొని నిత్య నూతనంగా దినదినాభివృద్ధి నొందుతూ నేడు రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘంగా ఎదిగింది.

Previous Post Next Post

Contact Form