Type Here to Get Search Results !

గ్రామ వార్డ్ సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ కి కసరత్తు

APTEACHERS

గ్రామ వార్డ్ సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు జారీకి కసరత్తు 

ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేయాలని సర్కారు నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్ని రకాల పత్రాలను ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై కసరత్తు చేసి విధివిధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. శుక్రవారం సీసీఎల్‌ఏ అధ్యక్షతన జరిగిన జాయింట్‌ కలెక్టర్ల సదస్సులో ఈ అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అంశంపై రెవెన్యూశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం కులం, ఆదాయం, స్థానికత తదితర పత్రాలను మండల స్థాయిలో రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. 
మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవి తహసీల్దార్‌ ఆఫీసుకు చేరుతాయి. వాటిపై విచారణ అనంతరం, సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇకపై ఈ విధానం గ్రామ, వార్డు స్థాయిలోనే అమలయ్యేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. ధ్రువీకరణ పత్రాలను జారీచేసే అధికారం తహసీల్దార్‌కే ఉన్నప్పటికీ గ్రామస్థాయిలోనే వాటి జారీపై తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఓ సర్క్యులర్‌ కూడా జారీ అయినట్లు తెలిసింది. దీనిపై జేసీల అభిప్రాయాలు తీసుకున్నారు. రెవెన్యూ సేవల్లో కొన్నింటిని వార్డు, గ్రామ సచివాలయాలకు బదిలీ చేయాలని ఇప్పటికే ప్రతిపాదించారు.
Tags

Top Post Ad

Bottom Post Ad